Weight Gain Vegetables: మీరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నట్లయితే కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండండి. కూరగాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొన్ని శరరీ బరువును వేగంగా పెంచుతాయట. అవేంటో తెలుసుకుందా రండి.

ఆరోగ్యకరమైన ఆహారాల్లో కూరగాయలు అత్యంత ముఖ్యమైనవి. అందుకే ప్రతి రోజూ వీటిని ఎక్కువగా తినాలని వైద్యులు, నిపుణులు చెబుతుంటారు. కూరగాయల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా కరాలుగా మేలు చేస్తాయి. ఇవన్నీ వాస్తవాలే. కానీ చాలా మందికి తెలియని మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. కూరగాయల్లో కొన్ని రకాలను ఎక్కువగా తీసుకుంటే శరీర బరువు వేగంగా పెరుగుతుంది. బక్క పలచగా, అనారోగ్యంగా ఉన్నవారికి ఓకే కానీ మీరు బరువు పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నట్లయితే లేదా మీరు మీ శరీరాన్ని సన్నగా, ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే కొన్ని వెజిటేబుల్స్‌ను మితంగా మాత్రమే తినాలి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు దూరంగా ఉండాల్సిన కొన్ని రకాల కూరగాయల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శరీర బరువును వేగంగా పెంచగల కొన్ని కూరగాయలు..
బంగాళాదుంపలు బరువును పెంచుతాయి:
బంగాళాదుంపలు చాలా మందికి ఇష్టమైన కూరగాయ. ఇవి కేవలం కూరలకు మాత్రమే ఉపయోగపడటం కాకుండా వీటితో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. వీటికున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. వీటితో ప్రతి వంటకం చాలా రుచికరంగా ఉంటుంది. ఇదే కారణంగా ప్రతి ఇంట్లో బంగాళాదుంపలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ బంగాళాదుంపల్లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర ఉంటాయి. దీని వల్ల మీ శరీర బరువు వేగంగా పెరుగుతుంది. మీరు ఇప్పటికే బరువుతో ఇబ్బంది పడుతున్నట్లయితే, బంగాళాదుంపలతో తయారు చేసిన పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోండి.
చిక్కుళ్లు, బీన్ కూడా అధిక బరువుకు కారణమవుతాయి..
చిక్కుళ్లు, బీన్స్ వంటి వాటిని కూడా ఎక్కువగా తిన్నారంటే శరీర బరువు వేగంగా పెరుగుతుంది. అవి క్లస్టర్ బీన్స్ అయినా, సోయాబీన్స్ అయినా, లేదా రాజ్మా అయినా సరే. ఇవన్నీ అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కేలరీలను కలిగి ఉంటాయి. అయితే బీన్స్‌లో ఇతర పోషకాలు కూడా ఉంటాయి, కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన బరవు పెరుగుతుంది. మీరు బరువు తక్కువగా ఉండి మీ బరువును పెంచుకోవాలనుకుంటే ఈ ఆహారం మీకు చాలా మంచిది. కానీ బరువు పెరుగుదలను నియంత్రించాలనుకుంటే మాత్రం ఈ కూరగాయలను మితంగా మాత్రమే తినడం మంచిది.
పచ్చి బఠాణీ వల్ల కూడా బరువు పెరుగుతుంది
శీతాకాలంలో పచ్చి బఠాణీ ఎక్కువగా లభిస్తుంది. రకరకాల కూరల్లోకి, స్పెషల్ రైస్ లలోకి లేదా పోహా తయారు చేయడానికి వీటిని తరచూ ఉపయోగిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో పచ్చి బఠాణీని వేయించుని కూడా అల్పాహారంగా తింటారు. ఇవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి, చాలా మందికి ఇష్టమైనవి కూడా. కానీ వీటిని పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతుంది. పచ్చి బఠాణీలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి మంచివే, కానీ వీటిని అధికంగా తినడం వల్ల బరువు కూడా వేగంగా పెరుగుతుంది.
బీట్‌రూట్ కూడా బరువును పెంచుతుంది
బీట్‌రూట్‌ను చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. చాలా మందికి సలాడ్‌లో బీట్‌రూట్ తినమని సలహా ఇస్తారు. కానీ ఈ బీట్‌రూట్ బరువును కూడా వేగంగా పెంచుతుంది. బీట్‌రూట్‌లో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి, దీని వల్ల బరువు వేగంగా పెరుగుతుంది. మీరు ఆరోగ్యకరమైన విధంగా బరువును పెంచుకోవాలనుకుంటే బీట్‌రూట్ మీకు ఉత్తమ ఎంపిక కావచ్చు. కానీ అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటే, బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటే మాత్రం బీట్‌రూట్‌ను తక్కువగా తీసుకోవాలి.
గోంగూరతో కూడా బరువు పెరిగే అవకాశముంది..
గోంగూర అనేది అనేక పోషకాలతో నిండిన కూరగాయ. దీనిని విటమిన్ A, విటమిన్ C లకు మంచి మూలంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఇందులో అధిక మొత్తంలో లభించే ఫైబర్ జీర్ణక్రియను సాఫీగా నిర్వహించడంలో సహాయపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన విధంగా మీ బరువును పెంచుకోవాలనుకుంటే గోంగూర మీకు చాలా మంచిది. కానీ తమ బరువు పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న వారు దీన్ని ఎంత తక్కువ మొత్తంలో తింటే అంత మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.